ఏం ఆగ్రహం.. ఏం ఆగ్రహం.. నరసాపురం ఎంపీ రఘురామరాజుగారు ఒక్కసారిగా రెచ్చిపోయారు. జగన్ సర్కారుపై `రెడ్డి` ముద్రవేసేశారు. ఆయన ఇన్నాళ్లలో ఎన్నో విమర్శలు చేసినా.. తాజాగా ఆయన రెచ్చిపోయిన తీరు మాత్రం గతంలో ఎప్పుడూ ఎవరూ చూడలేదు. పార్టీపై ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పుడు. పార్లమెంటులో తన సీటును మార్చినప్పుడు.. ఏకంగా స్పీకర్‌కు రాజుగారిని బర్తరఫ్ చేయాలని వైఎస్సార్ సీపీ తీవ్రస్థాయిలో ఫిర్యాదు చేసినప్పుడు.. ఇక, తన నియోజకవర్గానికే చెందిన ప్రసాదరాజు దూషించినప్పుడు కూడా రాజుగారు ఈ రేంజ్‌లో మాట్లాడలేదు. అయితే, తాజాగా మాత్రం ఒకరకంగా ఆయన నోటి నుంచి నిప్పులు కురిశాయి.
ఈ పరిణామం గమనించిన చాలా మంది రాజుగారు ఇన్నేసి మాటలంటుంటే.. సీఎం స్థాయిలో ఉండి, ఆయనకే టికెట్ ఇచ్చిన జగన్ పడాలా? అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం రాజు గారిది ధర్మాగ్రహం.. ఎన్నని మాత్రం పడతారు? అని సమర్ధించే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ఇదే సోషల్ మీడియాలో జగన్‌ను పొగుడుతూ.. కామెంట్లు పెట్టిన రాజుగారు.. ఇప్పుడు అదే సోషల్ మీడియాకు భయపడుతున్నారు. తెల్లారి లేచింది మొదలు ఎవరు తనను తిడతారో.. ఎవరు తనపై కామెంట్లు కుమ్మరిస్తారో.. నని బెంగతో ఉన్నారని ఆయన అనుచరులే చెప్పుకొంటున్నారు. మరి ఈ పరిస్థితి నిజంగానే ఏ ఎంపీకీ రారాదు.. రాకూడదు కూడా! కానీ, రాజుగారికి మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చింది.
మరి ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చర్చ కూడా సాగుతోంది. అయితే, దీనికి కొందరు చెబుతున్న సమాధానం.. స్వయంకృతం. సొంత పార్టీపైనే ఆయన కుమ్ములాటలకు దిగడం, కావాలనే విమర్శలు చేయడం, బీజేపీతో అంటకాగాలని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేయడం వంటివి రాజుగారికి తీవ్రంగా మైనస్‌గా మారిందని అంటున్నారు పరిశీలకులు. పరిస్థితులు ఎప్పుడూ రాజకీయాల్లో ఒకేలా ఉండవని అంటున్నారు పరిశీలకులు. ఇప్పడు ఆయన ఎవరిని చూసుకుని, ఎవరిమీద పడిపోతున్నారో.. రేపు వారే జగన్‌తో చేతులు కలిపితే.. ఎన్నికల నాటికి జగన్ కనుసన్నల్లోకి చేరిపోతే.. రాజుగారి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరి దీనికి రాజుగారు ఏం సమాధానం చెబుతారో చూడాలి.