రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.20వేలు ఎప్పుడు ఇస్తారు అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైసీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను దళారులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారని తెలిపారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ధాన్యానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఈనెల 13న రైతుల సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని.. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపు పై ఉద్యమిస్తామని తెలిపారు. జనవరిలో ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం ఉద్యమిస్తామని తెలిపారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.