“మిస్టర్ మోడీ” అన్న ఎంపీ.. నేడేరి?

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్న సమయం ఇది. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ సంతకం చేసినప్పటి నుంచీ రాజకీయ పార్టీల నేతల్లో కొత్త రకం వేడి మొదలైంది. దీంతో రాజీనామా సవాళ్లు.. డెడ్‌ లైన్లు…. ఇలా రాజధాని వికేంద్రీకరణ చుట్టూ ఏపీ రాజకీయాలు తెగ తిరిగేస్తున్నాయి. మరి ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ కీలక సమయంలో కనిపించకుండా పోయారు! ఇలాంటి సమయంలో ఆయన నల్లపూస కావడం ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో తీవ్ర చర్చోపచర్చలకు తెరదీసింది.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో కాపురం చేసినన్నాళ్లు బాగానే ఉంది. ఆ తర్వాత బీజేపీతో టీడీపీ సంబంధాలు తెగిపోగానే.. పార్లమెంట్ సాక్షిగా “మిస్టర్‌ మోడీ” అంటూ.. లోక్ ‌సభలో గర్జించి.. తెలుగు తమ్ముళ్లతో ఊరేగింపులు, పూలమాలలు వేయించుకున్నారు గల్లా జయదేవ్. అటువంటి నేత ఇప్పుడు ఒక్కసారిగా ఈ కీలక సమయంలో మాయమైపోయారు. అసలు అమరావతి ప్రాంతం ఆయన లోక్ ‌సభ పరిధిలోకే వస్తుంది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య రాజీనామాలు, డెడ్ ‌లైన్లతో రాజకీయం వేడెక్కుతోంది. అయినప్పటికీ… గల్లా జయదేవ్‌ చాలా కాలంగా అసలు ఊసేలేదు సరికదా.. కంటికి కనిపించడం కూడా మానేశారు. కనీసం ఫోన్ ‌కు కూడా అందుబాటులో లేరని అమరావతి ప్రాంత టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

అయితే అసలే ఇది కరోనా కాలమని తప్పించుకున్నా… ఫోన్ లో కానీ, ఇంట్లోంచి మీడియాకు వాయిస్ పంపడం కానీ చేస్తే రైతులకు కాస్త భరోసా ఉంటుంది కదా అనే భావనలో తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఏపీలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారు.. గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్ ‌నాయుడు. మిగతా ఇద్దరు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతం ఎంపీగా కీలక సమస్యలు తప్పించుకు తిరుగుతున్నారనే టాక్ బీభత్సంగా వినిపిస్తోంది. కరోనాతో భయపడి బయటకు రాకపోయినా… ఆఫీసులో అయినా అందుబాటులో ఉండి ఉద్యమించేవారికి అండగా ఉన్నామన్న ఫీలింగ్ ను కలిగించలేకపోతున్నారని ఆ ప్రాంతంలోని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో చలో అసెంబ్లీకి రైతులు పిలుపునిచ్చినప్పుడు జయదేవ్‌ చురుకుగా పాల్గొన్నారు. రాజధాని భూముల మీదుగా డొంకరోడ్లలో నడుచుకుంటూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకునే యత్నం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేయబోతే కార్యకర్తలు అడ్డుకోవడం.. పెనుగులాటలు వంటివి చోటుచేసుకున్నాయి. ఇదే ఘటనలో గల్లాకు కూడా గాయాలయ్యాయి. ఎంపీగా గెలిచిన తర్వాత గల్లా తీసుకున్న ఏకైక రిస్క్‌ ఉద్యమం ఇదేనని అప్పట్లో తెలుగు తమ్ముళ్లు చెప్పారు కూడా. ఆ సమయంలో చంద్రబాబు ముందు చొక్కా విప్పి మరీ గాయాలు చూపించిన గల్లా శెభాష్ అని కూడా అధినేత నుంచి ప్రశంసలందుకున్నారు.

అయితే ఈ సమయంలో గల్లా కనిపించకపోవడంతో ఛలో అసెంబ్లీ నాటి పోలీసు దెబ్బలకు జడిశినట్లుంది అని తెలుగు తమ్ముళ్లే జోకులేసుకుంటున్నారు! ముఖ్యంగా అమరావతిలో రాజధాని నిర్మాణాలు, డిజైన్ల రూపకల్పన, విదేశీ పర్యటనల్లో గల్లా జయదేవ్‌ కీలక పాత్ర పోషించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా.. క్రాస్‌ ఓటింగ్‌ పుణ్యమా అని గట్టెక్కేశారు. మరిప్పుడు అమరావతిలో కానరాకపోవడం తమ్ముళ్లను తీవ్ర ఆవేదనకు లోనుచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version