రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య యుద్ధం ఏ రేంజ్లో సాగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏ అంశం దొరికినా.. ఇరు పార్టీల నేతలు వదిలి పెట్టడం లేదు. సరే.. రాష్ట్రంలో తన్నుకున్నారు.. మున్ముందు కూడా తన్నుకుంటారు… ఓకే! సొంత రాష్ట్రం.. ప్రతిపక్ష నేతలు.. తన్నుకున్నారు.. విమర్శించుకున్నారు.. అని సరిపుచ్చుకోవచ్చు. కానీ, ఎటొచ్చీ.. ఢిల్లీలోని పార్లమెంటులోనూ ఇరు పక్షాలూ జుట్టూ జుట్టూ పట్టుకోవడం, దేశరాజధానిలోనూ పరస్పరం విమర్శలకు దిగడం.. ఒకరు మాట్లాడుతుంటే.. మరొకరు అడ్డు తగలడం అనేదే ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్న విషయం.
ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా.. తన సమస్యలకు పరిష్కారం కేంద్రం నుంచి సాఫీగా అమలు కావాలనే కోరుతుంది. ఈ క్రమంలోనే పార్లమెంటును వేదికగా చేసుకుని పోరాటం చేస్తాయి. ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు.. కేంద్రంపై పోరాడే సమయంలో ఒకే తాటిపైకి వచ్చేస్తాయి. ఒడిసా, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు దీనికి ఉదాహరణ. అయితే, ఎటొచ్చీ.. ఏపీ విషయానికి వస్తే.. మాత్రం.. వైసీపీ, టీడీపీ నేతలు.. ఇక్కడా తన్నుకుని.. అక్కడా కుంపటి పెట్టుకుంటే.. ఏపీ ప్రయోజనాలు ఎప్పటికి నెరవేరుతాయనేది మేధావుల ప్రశ్న.
ఇప్పటికే ఇలా తన్నుకునే ప్రత్యేక హోదాను నాకించేశారు. ప్యాకేజీని మూలన పెట్టారు. మరి ఇప్పుడు కూడా తన్నుకుంటే.. రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరికాదా ? అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడితే.. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల అడ్డుపడిపోతున్నారు. టాఠ్! ఆయన మైక్ కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సాయిరెడ్డి ఏం చెబుతున్నారో.. ఏం అడుగుతున్నారో కూడా తెలుసుకోకుండా.. కేవలం అడ్డు పడడే ఏకైక అజెండాగా కనకమేడల చేస్తున్నారు.
పెద్దలసభలోనే ఇలా ఉందనుకుంటే.. ఇక, లోక్‌సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి మాట్లాడితే.. వెంటనే టీడీపీ సభ్యుడు.. గల్లా జయదేవ్ అడ్డు పడిపోతున్నారు. వీరి దూకుడు చూసిన స్పీకర్.. తలపట్టుకుంటున్నారు. ఉత్తరాదికి చెందిన ఎంపీలు ఏకంగా నవ్వుతున్నారు. మరికొందరు ఫిష్ మార్కెట్.. ఫిష్ మార్కెట్ అంటూ గేలి చేస్తున్నారు. మరి మన నేతలు మారేదెప్పుడో..!!
-Vuyyuru Subhash