విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని వస్తున్నాయి. లేదా కొన్ని పాత ప్రతిపాదనలే సవరణకు నోచుకుని కొత్త గొంతుకల ద్వారా వినిపిస్తున్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయిందన్న ఆవేదనతో రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉమ్మడి రాజధాని కొనసాగింపు దిశగా సాగనున్నాయి. రాజకీయ పార్టీల తీరు ఎలా ఉన్నా విశ్వ విద్యాలయాలకు సంబంధించిన స్టూడెంట్ జేఏసీలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించి సంబంధిత కార్యాచరణకు పూనిక వహించనున్నాయి.
చాలా రోజుల తరువాత ఓ నినాదం వినిపిస్తోంది. ఎలానూ ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయి కనుక, విభజన చట్టం అనుసరించి ఏపీకీ, టీజీకీ న్యాయం దక్కేలా ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ను మరో 30 ఏళ్లు కొనసాగించాలన్న డిమాండ్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో మరి! ఉమ్మడి రాజధాని సాధనతో పాటు ప్రత్యేక హోదా సాధనకూ తాము కృషి చేయనున్నామని సంబంధిత ఉద్యమకారులు గళం వినిపిస్తున్నారు. విపక్ష , అధికార పక్ష నేతలు రాజకీయాలు విడిచి రాష్ట్రం శ్రేయోస్సు కోసం తమతో కలిసి పనిచేయాలని అటు చంద్రబాబును, ఇటు జగన్ ను వేడుకుంటున్నారు.
ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ను డిక్లైర్ చేసి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావొస్తుంది. మరో రెండేళ్లలో ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ అన్న మాట కూడా మనం మరిచిపోవచ్చు. ఎందుకంటే అక్కడితో గడువు తీరిపోతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తున్నారు కొందరు. అంటే ఆ రోజు పదేళ్లు (విభజన చట్టం అనుసరించి) ఉమ్మడి రాజధాని అని డిక్లైర్ చేశాక, ఏపీ సర్కారు పెద్దలు మాత్రం అక్కడ ఉండలేం అని, ఓటు కు నోటు కేసు ఉదంతం తరువాత వచ్చేశారు. తరువాత కాలంలో ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి హక్కులపై ఎవ్వరూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. తాజాగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉమ్మడి రాజధాని అన్న పదాన్ని తెరపైకి తెచ్చి, కొత్త వివాదం ఒకటి సృష్టిస్తున్నారు.
ఈ సారి ఉమ్మడి రాజధాని పది కాదు ఇరవై కాదు ఏకంగా 30 ఏళ్లు ఉంచాలన్న డిమాండ్ తో కొందరు ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారు. ఒంగోలు కేంద్రంగా ఇందుకు సంబంధించి ఉద్యమం కూడా ఆరంభం అయింది. స్టూడెంట్ జేఏసీ నేతలు ఈ నినాదం వినిపిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఇకపై మరింతగా కార్యాచరణను విస్తృతం చేయనున్నామని చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా ఏపీ, టీజీలకు సంబంధించి భాగ్యనగరిని ఉంచుతూ, 30 ఏళ్ల పాటు సంబంధిత నిర్ణయం అమలు అయ్యేలా చేయమని కోరుతూ పార్లమెంట్ లో చట్టం చేయమని కూడా గౌరవ చట్ట సభలకు చెందిన ప్రజాప్రతినిధులను వీరంతా వేడుకుంటున్నారు..