ఉత్తరాంధ్రలోని కీలకమైన జిల్లా విజయనగరంలో బీజేపీ ఉనికినిన్న మొన్నటి వరకు లేనే లేదు. పైగా.. ఇక్కడ పార్టీ జెండా మోసే నాయకులు కూడా కరువే. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కుతామని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని కమల నాథులు ప్రచారం చేసుకుంటున్నా.. విజయనగరంలో మాత్రం ఆ తరహా రాజకీయాలు కనిపించలేదు. ఎప్పుడూ ఇక్కడ బీజేపీ ఉరుకులు పరుగులు పెట్టిన పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే, అనూహ్యంగా ఇక్క డ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు బీజేపీ విజయనగరంపై దూకుడు పెంచింది. పలు కార్యక్రమాలను ఇక్కడ నుంచే రూపొందించాలని కూడా నిర్ణయించుకుంది. దీనికి కారణం ఏంటి? అంటే.. రెండు రీజన్లు కనిపిస్తున్నాయి. ఒకటి టీడీపీ నుంచి ఇటీవల సీనియర్ నాయకుడు .. చీపురుపల్లి నియోకవర్గం నుంచి రెండు సార్లు. అన్న ఎన్టీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత.. కమ్మ వర్గానికి చెందిన గద్దె బాబూరావు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చాన్నాళ్లుగా ఆయన చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనేఆయన బీజేపీ వైపు మళ్లారు.
ఈ చేరికను కూడా చాలా అట్టహాసంగా నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ.. బీజేపీవైపు మళ్లింది. పైగా సోము వీర్రాజు, దేవ్‌ధర్ వంటి నాయకులు కూడా ఇక్కడకు వచ్చి గద్దెను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. దీనివెనుక చాలానే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అటు టీడీపీలో ఇటు.. వైసీపీలోనూ చాలా మంది నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించి.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో గద్దె ఆధ్వర్యంలో మరిన్ని సభలకు కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక, టీడీపీపై ప్రధానంగా దృష్టి సారించి.. ఇటీవల పార్టీ పార్లమెంటరీ పదవుల్లోను, ఇతరత్రా పదవుల్లోనూ తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. చూడాలి .. మరి బీజేపీ ఏ విధంగా దూకుడు ప్రదర్శిస్తుందో..!