సీఎం జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానులు కు సంబంధించిన బిల్లు సహా సీఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లులను ఏపీ గవర్నర్ ఆమోదం తెలపడం తో ఆంధ్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఎంతో మంది నేతలు స్పందించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ విషయమై మాటల యుద్ధం మొదలైంది. అయితే తాజాగా.. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు.. మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా ఏపీ ప్రభుత్వానిదేనని, బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో భాగమని, ఆయన రాజకీయ వ్యవస్థలో భాగం కాదని పేర్కొన్నారు. అలాగే అమరావతిలోనే రాజధాని ఉండాలని, అదే తమ పార్టీ నిర్ణయమని చెబుతూనే.. మరోవైపు రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. అందులో కేంద్రం జోక్యం చేసుకోదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అదేవిధంగా రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్నామని, వారికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని వివరించారు.