అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి…తాజాగా మరిన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ ఆర్టీసీ విలీననానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. అలాగే ప్రజా రవాణా శాఖని ఏర్పాటు చేస్తూ..ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ కాలం 60 ఏళ్లకు పెంచారు.
అటు కొత్త ఇసుక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇసుక టన్ను ధర రూ. 375గా ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా ఇసుక రీచ్లు , స్టాక్ పాయింట్లు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలి దశలో 58 స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీఏండీపీ సైట్ ద్వారా ఇసుకని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
అదేవిధంగా ఆశావర్కర్ల వేతనాల పెంపునకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెరగనున్నాయి. సొంత ఆటోలు, ట్యాక్సీలు ఉండి, వాటిని నడుపుకొనే వారికి ఏటా రూ.10వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లికానుక అందనుంది. పెళ్లిరోజే పెళ్లికానుక అందిస్తారు. ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్ష, ఎస్సీ ఎస్టీలకు రూ.1.25లక్షలు, బీసీలకు రూ.50వేలు, బీసీలు కులాంతర వివాహం రూ.75వేలు, మైనారిటీలకు రూ.లక్ష, వికలాంగులకు రూ.1.50లక్షలు, భవన నిర్మాణ కార్మికలు పిల్లలకు రూ.లక్ష.
అలాగే నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు ఆమోదం తెలిపిన కేబినెట్…రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.
కేబినెట్ లో తీసుకున్న పలు నిర్ణయాలు
ఆంధ్రబ్యాంక్ పేరు యథాతథంగా ఉంచేలా జగన్ ప్రధానికి లేఖ రాయనున్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో హిందుస్తాన్ పెట్రోల్ కంపెనీకి 25 ఎకరాల భూమి కేటాయింపు. టీటీడీ బోర్డులోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కి పెంపు. మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.