ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఇదేనంటూ గత రెండు రోజులుగా వార్తలు ఊపందుకుంటున్నాయి. అప్పుడు.. గుంటూరు, అమరావతి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా ఇప్పుడు మళ్లీ.. మరో ఊరి పేరు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వార్తలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. బొత్స మాట్లాడుతూ ఏపీ రాజధాని ప్రాంతం ముంపు జోన్‌లో ఉందని… ఈ నేపథ్యంలోనే రాజధాని అక్కడ కట్టాలంటే ఇప్పుడు అయ్యే వ్యయంకు డబుల్ అవుతుందని.. అందుకే రాజధానిపై చర్చ జరుగుతోందని… దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
అటు ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలించేస్తున్నారన్న వార్తలు… ఇటు ప్రభుత్వంలో కీలక మంత్రి, వైసీపీ సీనియర్ నేతగా ఉన్న బొత్స కూడా ఇందుకు ఊతమిచ్చేలా మాట్లాడడంతో ఇంకేముంది… ఏపీ రాజధాని మారిపోతుందంటూ ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఏపీలో వైరల్ అవుతోన్న కొత్త రాజధాని ఏదో కాదు ప్రకాశం జిల్లాలోని దొనకొండ. దొనకొండ.. ప్రకాశం జిల్లాలో కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ కావాల్సినన్ని ఖాళీ భూములు.. దగ్గరలో సముద్రం కూడా ఉంది.
ఇక నల్లమల్ల ఏరియా ఇక్కడ ఆనుకునే ఉంటుంది… కావాల్సినంత పచ్చదనం ఉంటుంది. దీంతో మన నేతలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లు అప్పుడే దొనకొండపై పడిపోయాయి. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఈ ప్రాంతం ఉంటుంది. అటు కర్నూలు, ఇటు గుంటూరు జిల్లాలకు సరిహద్దులో ఉంటుంది. బ్రిటీష్ వారి హయాంలో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. ఆ ఎయిర్‌పోర్టు ఇప్పటకీ ఉంది.
ఈ నేపథ్యంలోనే రాజధాని మార్పు వార్తలతో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఒక్కసారిగా ఇక్కడ భూముల కొనుగోళ్లు, అమ్మాకాలు ఊపందుకున్నాయి. రియల్ వ్యాపారం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఇప్పుడు దొనకొండలోని ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో.. ఇది నాలుగు రెట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.
కొంతమంది మాత్రం దొనకొండ రాజధాని అయినా కాకపోయినా ఇక్కడ జగన్ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని.. ఐటీ, ఫార్మా, ఇతర నిర్మాణ రంగ కంపెనీలు ఇక్కడే ఏర్పాటు అవుతాయన్న ధీమాతో ఉన్నారు. అందుకే తాము కొన్న భూములకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ధైర్యంతో వాళ్లు ముందుడగు వేస్తున్నారు. మరి వీళ్ల ఆశలు, అంచనాలు ఏమవుతాయో ? చూడాలి.