నెల్లూరు జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్కో మూడో యూనిట్ ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.ఈ నేపథ్యంలో ముందుగా ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి, 10.5 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు.తర్వాత నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. విశాఖ గర్జన తర్వాత ఎయిర్ పోర్ట్ లో మంత్రుల కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి తెలిసిందే. ఆ తర్వాత మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు జనసేన నాయకులనుంచి అపాయం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ లోని మూడో యూనిట్ ను జగన్ జాతికి అంకితం చేసే కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.