ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బుధవారం కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో జగన్ పలువురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు సైతం ఆయన వార్నింగ్‌లు ఇవ్వడం విశేషం. జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే. ముఖ్యమంత్రిగా నేనూ ప్రభుత్వ బాధ్యతలే చూసుకుని.. మంత్రులుగా మీరూ శాఖాపరమైన బాధ్యతలే చూసుకుంటే పార్టీ బలోపేతమయ్యేదెలా ? అని వారిని ప్రశ్నించినట్టు తెలిసింది.
కేవలం మీ నియోజకవర్గాల్లో…. జిల్లాలో…. మీ శాఖలో చూసుకుంటే సరిపోదు మీ జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వారే ఎమ్మెల్యేలకు నాయకులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గొడవల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఎమ్మెల్యేలు బలంగా ఉంటేనే.. పార్టీ బలంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం పెంచే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే అని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇక ముఖ్యంగా మంత్రులు సచివాలయానికి రాకుండా తమ జిల్లాలకు, నియోజకవర్గాలకు పరిమితం కావడంతో వారిపై జగన్ తీవ్రస్థాయిలో సీరియస్ అయినట్టు సమాచారం. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తారని… మంత్రులు లేకపోతో వారు నిరాశతో వెళ్లిపోతారని…. మంత్రులు సచివాలయాల్లో ఎందుకు ? ఉండరని జగన్ మంత్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు అసలు సచివాలయానికే రావడం లేదన్న కంప్లెంట్లు ఎక్కువుగా వస్తుండడంతో ఆ మంత్రులకు జగన్ గట్టిగానే ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. మంత్రులు కనీసం వారంలో రెండు మూడు రోజులు అయినా సచివాలయంలోనే ఉండాలని నేరుగా చెప్పేశారట. ఎవరైతే సరిగా ఉండరో వారిని నిర్దాక్షిణ్యంగా మంత్రి పదవి నుంచి తొలగిస్తానని.. ఈ విషయంలో ఎవ్వరూ బాధపడవద్దని కూడా సూచించినట్టు సమాచారం.