కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో వైద్యులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు, రెసిడెంట్ స్పెషలిస్టులకు గౌరవ వేతనం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ వైద్యారోగ్యశాఖ. సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ. 70 వేలకు, రెసిడెంట్ డెంటిస్టులకు రూ. 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు రూ. 85 వేల మేర వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
గతేడాది సెప్టెంబరు నుంచి పెంచిన వేతనం వర్తించనున్నట్లు పేర్కొంది. కరోనా సమయం వైద్యుల సేవలు.. ఎంతో విలువైనవని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7796 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,68,112 కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 77 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,629 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,07,588 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.