మీరే పదవుల్లో ఉంటారా..మాకు అవకాశం ఇవ్వరా ?

-

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు పంచాయతీ ఎన్నికలు ఎక్కడలేని తలనొప్పిగా మారాయి. సాధారణంగా పంచాయితీ ఎన్నికలు అనగానే ఏకగ్రీవాలు తెరపైకి వస్తాయి. అయితే అన్ని చోట్లా ఇది సులభం కాదు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలు తలనొప్పిగా మారాయట. ఓ పక్క ఏకగ్రీవాలు చేయాలని అధిష్ఠానం నుండి ఆదేశాలు వస్తుంటే , గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయట. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ఎన్నికల తలనొప్పి ఏంట్రా బాబు…అంటూ తల పట్టుకుంటున్నారు.

పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఏకగ్రీవాల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు మండల స్థాయి నేతలతో జిల్లా వ్యాప్తంగా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ బలంగా ఉన్నచోట ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులకు ఎర వేసే కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. పైచేయి సాధించడంలో భాగంగా వైసీపీ నేతలు పల్లెల్లో మకాం వేస్తూ, అధిష్ఠానం ఆదేశాలను అమలు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, ఈ ఉత్సాహంలో వెళ్లిన నేతలకు మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇస్తున్నారట లోకల్ వైసీపీ నేతలు.

పార్టీ ఏం చెప్తున్నా మాకనవసరం.. పంచాయతీ పోటీలో ఉండి తీరాల్సిందే అంటున్నారట స్థానిక నేతలు. ఒకటి రెండు చోట్ల కాదు.. జిల్లాల్లో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏకగ్రీవాలను ఆశించిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిందట. జిల్లాలో అధికార పార్టీలో గ్రూపుతగాదాలు ఏకగ్రీవాలకు అడ్డంపడుతున్నాయని టాక్. పార్టీలో రెండు గ్రూపులు పదవులకు పోటీ పడే అవకాశం ఉండటంతో వారితో రాజీ కుదర్చడం అంత సులభంగా కాదనే మాటలు వినపడుతూన్నాయి. ఇప్పటికే మండల, జడ్పీ ఎన్నికలకు కూడా అభ్యర్థులు ఖరారవడంతో తర్వాత పదవులు ఇస్తామనే భరోసా ఇవ్వడానికి అవకాశం లేకపోయింది.

మీరు మాత్రం పదవుల్లో ఉండాలీ. ఇన్నాళ్ళూ కష్టపడిన మాకు పదవులు వద్దా అని పంచాయితీ పెడుతున్నారట స్థానిక నేతలు. అయితే ఈ విభేదాలెలా ఉన్నా, నామినేషన్లు వేసే అభ్యర్థులకు అండగా నిలిచేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తలనొప్పిగా తయారవుతున్న వారిని అడ్డుకునేందుకు, వీలైనంత వరకు ఒప్పించి సమస్య లేకుండా చేసేందుకు కూడా రెడీ అవుతున్నారట.ఇక కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్ తో పాటు, ఎన్నికల తర్వాత టిడిపి నుండి వైసీపీలో చేరిన నేతలు కూడా మాకూ అవకాశం ఇవ్వమని గట్టిగానే అడుగుతున్నారట. లేదంటే మాదారి మేం చూసుకుంటామని హెచ్చరిస్తున్నారట.

ఈ పరిణామాలతో ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారట. ఆల్రెడీ టైం తక్కువుంది. బెదిరిస్తే ప్రయోజనం లేదు. అలాగని డిమాండ్లను ఒప్పుకునే అవకాశం లేదు. ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్లు…ఈ టైంలో కేడర్ షాక్ ఇవ్వడంతో… అధిష్ఠానం ఆశిస్తున్నట్టుగా ఏకగ్రీవాలు అవుతాయో లేదో అనే టెన్షన్ లో పడ్డారు ఎమ్మెల్యేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version