ఆంధ్రప్రదేశ్‌లో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ్టి నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవాప్తంగా ఉన్న 35వేల మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. తిరుపతి, నెల్లూరు, నంద్యాల, గుంటూరు మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనం చెల్లించాలని అదేవిధంగా భత్యం ఇవ్వాలని కోరుతున్నారు కార్మికులు. హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని, డ్రైవర్లకు, యూడీఎస్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు.
ఔట్‌సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని , పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 9 ప్రధాన డిమాండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు గత నెలలో సమ్మె నోటీసులిచ్చాయి. పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో పారిశుద్ధ్య కార్మికులు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు.