యాపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మార్ట్‌ఫోన్లను వాడేవారికి మాత్రమే యాపిల్ ఐఫోన్ల విలువ ఏంటో తెలుస్తుంది. ఆ మాట కొస్తే ఇతర ఫోన్లను వాడేవారికి కూడా ఐఫోన్‌ను వాడాలనే ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే వినియోగదారుల అభిరుచుల మేరకు యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్లను విడుదల చేస్తూ వాటికి సేల్స్‌ను పెంచుకుంటూ వస్తోంది. కానీ ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఐఫోన్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఈ విషయంపై స్పందించారు.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవలే విడుదలైన ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్, ఐఫోన్ XR ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో తమ కంపెనీ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. ఫోన్ల అమ్మకాలను పెంచాలన్నారు. ఈ క్రమంలో టిమ్ కుక్ రాసిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అంతటితో ఆగకుండా.. అసలు కొత్త ఐఫోన్ల అమ్మకాలు పడిపోవడానికి కస్టమర్లే కారణమని అన్నారు. దీంతో ఇప్పుడు యాపిల్ ఐఫోన్ వినియోగదారులు టిమ్ కుక్ వ్యాఖ్యలపై విమర్శిస్తున్నారు.
యాపిల్ కొత్త ఐఫోన్ల అమ్మకాలు పడిపోవడానికి కస్టమర్లే కారణమని, వారు పాత ఐఫోన్లను పట్టుకుని వేళ్లాడుతున్నారని, కొత్త మోడల్స్‌కు అప్‌గ్రేడ్ అవడం లేదని, అందువల్లే నూతన ఐఫోన్ల అమ్మకాలు పడిపోయాయని టిమ్ కుక్ అన్నారు. కాగా యాపిల్ కొత్త ఐఫోన్ల అమ్మకాలు తగ్గడానికి చైనాయే ప్రధాన కారణమని తెలుస్తోంది. అక్కడి హువావే కంపెనీ యాపిల్ కొత్త ఐఫోన్లకు గట్టిపోటినిస్తున్నందునే ఐఫోన్ల అమ్మకాలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై టిమ్ కుక్ చేసిన వ్యాఖ్యలను ఐఫోన్ యూజర్లు ఖండిస్తున్నారు. ఇక ఐఫోన్లను వాడని వారు కూడా టిమ్ కుక్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ముందు ఫోన్ల ధరలను తగ్గించాలని, ఒక ఐఫోన్ టాప్ మోడల్ కొంటే రూ.1.44 లక్షలు అవుతుందని, దాంతో శాంసంగ్, వన్‌ప్లస్ వంటి కంపెనీలకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు 3 కొనవచ్చని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మరి ఐఫోన్ సేల్స్‌ను పెంచుకోవాలంటే టిమ్ కుక్ ఎలాంటి ప్లాన్ వేస్తారో వేచి చూస్తే తెలుస్తుంది.