టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘యాపిల్’ తన యాప్ స్టోర్ నుంచి 29,800 చైనా యాప్స్ ను తొలిగించింది. వాటిలో 26 వేలకు పైగా యాప్స్ గేమ్స్ కు సంబంధించినవి ఉన్నాయి. అనుమతి లేని గేమ్స్ పై చైనా అధికారులు దాడులు జరుపుతున్న నేపథ్యంలో యాపిల్ ఈ చర్య తీసుకుంది. కాగా గేమ్ యాప్స్ రూపొందించేవారిని ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సులు సమర్పించాలని గతేడాది యాపిల్ సంస్థ కోరింది.
ఇక, గత నెల మొదటివారంలో 2500కుపైగా యాప్‌లను తన యాప్ స్టోర్ నుంచి యాపిల్ తొలగించిన విషయం తెలిసిందే. వీటిలో జింగ్యా, సూపర్‌సెల్ వంటివి కూడా ఉన్నాయి. సున్నితమైన కంటెంట్‌ను తొలగించేందుకు చైనా ప్రభుత్వం తన గేమింగ్ పరిశ్రమపై కఠినమైన నిబంధనలను అమలు చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. పెద్ద పెద్ద గేమ్ డెవలపర్లకు తప్ప ఇది అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని పరిశ్రమకు చెందిన వ్యక్తులు చెబుతున్నారు.