గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి ఓ ప్రత్యేకత ఉన్న నాయకుడు. వైసీపీలో ఎవరూ చేయని విధంగా చంద్రబాబుపైనా.. ఆయన పార్టీపైనా సైలెంట్ వార్ చేయడంలో ఆళ్లను మించిన నాయకులు లేరంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయనకు చుక్కలు చూపించారు ఆళ్ల. రాజధాని భూముల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందన్న రైతుల గోడును తొలిసారి మీడియాకు వెల్లడించడంతోపాటు కోర్టులకు తీసుకువెళ్లడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఫలితంగానే మంగళగిరిలో చాలా మంది రైతులు తమ భూములను కాపాడుకున్నారనే వాదన ఉంది.
ఈ రిజల్టే ఆళ్లకు గత ఏడాది ఎన్నికల్లో ఫలితం వచ్చేలా చేసిందని కూడా చెబుతారు. ఏకంగా చంద్రబాబు తనయుడు లోకేష్‌నే ఓడించి జెయింట్ కిల్లర్ అయ్యారు. ఇక, ఆ తర్వాత కూడా ప్రపంచ బ్యాంకు అమరావతికి నిధులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆళ్ల విజృంభించారు. ఇక్కడి వాస్తవాలు ఇవీ.. అంటూ.. ఆయన కొన్ని నివేదికలు ఇచ్చారు. సరే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం లేదు. పైగా బాబు అనుయాయులే రాష్ట్ర వ్యాప్తంగా ఏదొ ఒక కేసు పెట్టి జగన్ సర్కారుకు మట్టి పూసే పనులు సాగిస్తున్నారు.
పైగా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. అయినప్పటికీ.. ఆళ్ల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో ఆయన బాబుకు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆళ్ల బాబుపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం అక్రమంగా భూమి కేటాయించిందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన ఆ కేటాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ 22.06.2017 నాటి జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల తరఫున న్యాయవాది అల్లంకి రమేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామంపై ఇప్పటికే హైకోర్టు స్పందించి.. కేసును కొట్టేసినా.. ఆళ్ల మాత్రం పట్టువీడని విక్రమార్కుడిలా సుప్రీంకు ఎక్కడంతో బాబు పరిస్థితి తర్జన భర్జనలో పడింది. మరి ఏమవుతుందో చూడాలి. మొత్తానికి ఆళ్ల మాత్రం బాబును వీడడం లేదు.