ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో అత్యంత కీలక రోల్ పోషిస్తున్న దేశంగా భారత్ ఎంతో ప్రాముఖ్యం సంపాయించుకుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి పెట్టని కోటగా భాసించే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్న దేశంగా కూడా కీర్తి సంపాయిం చుకుంది. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా.. అందరూ తిప్పి చూసే ఏకైక గ్రంథం రాజ్యాంగమే! అలాంటి రాజ్యాంగంలో 19వ ఆర్టి కల్ ఎప్పుడూ వివాదానికి కేంద్ర బిందువే! దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. ఎక్కడ హక్కులు నొక్కుడు పడుతున్నా.. వినిపించే నినాదం ఆర్టికల్ 19. ఇదే, భావ ప్రకటన స్వేచ్ఛ. భారతీయులమైన మేము.. అని ప్రారంభించే పీఠిక.. ఈ దేశంలో వర్ణ, వర్గ విచక్షణను పక్కన పెట్టి అందరికీ కల్పించిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ.
అయితే, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ.. అనేది అనాదిగా దేశంలో ఓ వివాదాస్పదంగానే ఉంది. హక్కుల కోసం ఉద్యమించిన సమ యంలో ముఖ్యంగా ఎలుగెత్తేది ఈ ఆర్టికల్‌ను అణగదొక్కుతున్నారనే. ముఖ్యంగా ఈ ఆర్టికల్ తో ఇబ్బందులున్నాయనే వారిలో మేధావి వర్గాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రభుత్వాలు తీసుకునేనిర్ణయాలు, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు వ్యవహరించే తీరుపై ఎలాంటి శషభిషలకు తావులేకుండా మేధావులు తమ గళాలను వినిపించడం, రాతలు రాయడం మనకు తెలిసిందే. అలాంటి అవకాశం కల్పించింది ఆర్టికల్ 19.
అయితే, ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఇలాంటి వారిపై కేసులు నమో దు చేయడం మనకు తెలిసిందే. ఈ సమయాల్లోనే సదరు వ్యక్తులు లేదా సంస్థలు భావ ప్రకటనపై జరుగుతున్న దాడిగా తమపై జరుగుతున్న దాడిని అభివర్ణించడమూ మనం చూసిందే!. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన పూందోట రంగనాయకమ్మ విషయంలోనూ మరోసారి ఆర్టికల్ 19 చర్చకు వచ్చింది. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ విషయంలో కొన్ని వివాదాస్పద(ప్రభుత్వ వ్యతిరేక అని అంటున్న విషయం తెలిసిందే) పోస్టులు కాపీ పేస్ట్ చేశారని, ఫార్వార్డ్ చేశారని ఆమెపై సీఐడీ కేసు నమోదు చేయడం, విచారించడం మనం చూస్తున్నాం.
అయితే, ఇది ఇప్పుడే జరిగిందా? కేవలం జగన్ ప్రభుత్వంలోనే ఆర్టికల్ 19 వివాదాస్పదమైందా? అంటే.. ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ సమయంలో నూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన వారిపై.. పోస్టులు పెట్టిన వారిపై వందల కొద్దీ కేసులునమోదయ్యాయి. కానీ, నేడు మాత్రం ఇదే కొత్త అన్నట్టుగా ప్రచారం జరుగుతుండడమే చిత్రమైన అంశం. ఇక, ఏయే సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుగా పరిగణించబడుతుందో గతంలో వెలుగు చూసిన అనేక కేసుల విషయం లో సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యక్తిగా తన అభిప్రాయం చెప్పడాన్ని ఈ ఆర్టికల్ అనుమతిస్తుం దన డంలో సందేహం లేదు.
అయితే, అదే వ్యక్తి.. భావము-ప్రకటన-స్వేచ్ఛ అనే మూడు భాగాలుగా ఈ ఆర్టికల్‌ను విడదీసి తనకు నచ్చిన భావాన్ని వెలువరిస్తూ.. ఒక వివాదాన్ని సృష్టించేలా చేయడం,తనకు ఇష్టానుసారంగా దీనిని ప్రకటనగామార్చి ప్రచారం కల్పించడం.. తనకు నచ్చిన విధంగా స్వేచ్చను అనుభవించడం అనే విషయాలను ఈ ఆర్టికల్ ఎన్నటికీ సమర్ధించబోదని అనేక సందర్భాల్లో కోర్టులు వెల్లడించాయి. పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత అవసరమో.. భావాన్ని, ప్రకటనను, స్వేచ్ఛను మంచికి వినియోగించడం కూడా అంతే అవసరం అనేది ఆర్టికల్ 19 అంతరార్థం. కానీ, దీనిని తోసిరాజని నేడు నడమంత్రపు కామెంట్లు బయల్దేరుతుండబడ్డే విశాల హితంతో ఏర్పడిన ఆర్టికల్ 19కు మసక పడుతోందని అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. నిజమేనా?!