మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్‌

-

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలో దింపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు. “ప్రధాని మోదీని ఓడించాలన్నది మీ లక్ష్యం అయితే, మోదీ ఇక ఎప్పటికీ ప్రధాని కాకూడదన్నది నా లక్ష్యం. మీరెప్పుడైనా బీజేపీకి ఓటేశారా అని నేను మిమ్మల్ని అడిగితే, ఓటు వేయలేదని మీరు చెబితే… మరి ఇన్నాళ్ల పాటు బీజేపీ ఎలా గెలుస్తున్నట్టు? రాహుల్ గాంధీ ఓటర్లు, అశోక్ గెహ్లాట్ ఓటర్లు కూడా ప్రధాని మోదీని తమ హీరోగా పేర్కొంటారు.

ఇప్పుడు మేం రాజస్థాన్ లో పోటీ చేయడానికి వచ్చే సరికి ఒవైసీ ఓట్లు చీల్చడానికి వచ్చాడు అంటున్నారు. ఒవైసీ రాకతో బీజేపీకి లబ్ది చేకూరుతుందని అంటున్నారు. వీళ్లందరినీ నేను ఒకటి అడగదలుచుకున్నా… మేం ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. మరి ఇన్నాళ్లు బీజేపీ ఎవరి వల్ల గెలిచింది? 2019 ఎన్నికల్లో ఇక్కడి బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారు? కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పగలదా?” అంటూ రాజస్థాన్ అధికార పక్షంపై ఒవైసీ ధ్వజమెత్తారు.

అంతకుముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో తొలిసారిగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పారు. జైపూర్‌లోని హవా మహల్, సికార్‌లోని ఫతేపూర్, భరత్‌పూర్‌లోని కమాన్ నియోజకవర్గాల నుంచి ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టిందని తెలిపారు. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి మరిన్ని పేర్లను ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. పార్టీ తొలిసారిగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని… మా అభ్యర్థుల విజయం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version