పురందేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని విజయసాయిరెడ్డి ఆమెపై దూషణలకు దిగజారాడంటూ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఇవాళ అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి అవినీతి, నేరాలు చర్చనీయాంశాలే అని, తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని దుస్థితికి సాయి రెడ్డి దిగజారాడన్నారు. ప్రశ్నించిన వారికి కులాలు, కుటిల రాజకీయాలు అంటగట్టే అలవాటు విజయసాయిరెడ్డిది అని ఆయన మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడమే వైసీపీ నేతల సంస్కృతి అని అయ్యన్న పాత్రులు ధ్వజమెత్తారు.
అంతేకాకుండా.. ‘సిద్ధాంతాలు, నీతి నియమాలు గాలికొదిలేసి అడ్డదారులు తొక్కడం వైసీపీ నైజం. త్వరలో మూసేసే వైసీపీ కార్యాలయం ముందు ‘టులెట్’ బోర్డు పట్టుకోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉండాలి. ఇసుక, మద్యం, గనులు వంటి అనేక వ్యవహారాల్లో వైసీపీ పెద్దల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో పురందేశ్వరి ఎండగడుతున్నారు. పురందేశ్వరిపై వైసీపీ నేతలు పోటీపడి విషం చిమ్ముతున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడం, ప్రకృతి వనరులను మింగేయడం వైసీపీకి అలవాటు. ఒకే కులానికి అన్ని పదవులు కట్టబెడుతూ, బడుగు బలహీనవర్గాలను వంచించడమే జగన్ రెడ్డి అజెండా. జగన్‌రెడ్డి అరాచక పాలనను ప్రశ్నించడం నేరమా? నోరెత్తిన వారిపై కేసులు పెట్టడం, దుష్ప్రచారం చేయడం వైసీపీ నైజం కాదా?’ అని అయ్యన్న పాత్రడు వ్యాఖ్యానించారు.