గుండెపోటుతో మేడ్చల్ జిల్లాలో ఓ విద్యార్థి మృతి చెందాడు. తోటి విద్యార్థులతో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ (21) హైదరాబాద్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ఫ్రెండ్స్ తో కాలేజీ గ్రౌండులో క్రికెట్ ఆడుతుండగా.. ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే విద్యార్థులు అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వినయ్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. కళ్ల ముందే తమ స్నేహితుడు కుప్పకూలిపోయి మరణించడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎంతో సరదాగా ఉండే మిత్రుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు.
ఇటీవల చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణిస్తున్న విషయం తెలిసిందే. జీవనశైలి, ఆహారపుటలవాట్లలో మార్పులు వల్ల చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. జీవనశైలిలో పలు మార్పులు చేసుకుంటే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది.