రైతుల మెడకు ఉరితాళ్లు వేయవద్దని అంటున్నారు చంద్రబాబు. అదేవిధంగా వ్యవసాయ సంబంధ సమస్యలనే ప్రధాన అజెండాగా చేసుకుని సంబంధిత వర్గాల మెప్పుకోసం మరింత శ్రద్ధ వహించి వారి సమస్యలను తన ప్రసంగాల్లో చొప్పిస్తున్నారు.
ఈ నేపథ్యాన ఉమ్మడి చిత్తూరు జిల్లా, కుప్పం పర్యటనలో ఉన్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత హోదాలో కాకుండా మీలో ఒక్కడిగానే ఉంటానంటూ పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు తన తప్పిదాలను దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో ఉండి వారి సమస్యలను తెలుసుకుని వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే సందర్భంలో నిన్నటి రోజు (గురువారం, మే 12,2022) ద్రవిడ యూనివర్శిటీని సందర్శించి అక్కడి విద్యార్థులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా బోర్లకు వ్యవసాయ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై బాబు భగ్గుమన్నారు.
కేంద్రం ఆదేశాలు మేరకు వైసీపీ సర్కారు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా ప్రయత్నాలు చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసి, వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు వేరుగా అమర్చి వెళ్లారు. ఇకపై వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ బదులు రైతుకు వచ్చిన వ్యవసాయ విద్యుత్ బిల్లును ఆయన ఖాతాకే నగదు రూపంలో జమ చేయనున్నారు. దీనిపై ఎప్పటి నుంచో ఆంధ్రా, తెలంగాణల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇదే విషయమై చంద్రబాబు కూడా మరోసారి గళం వినిపించారు. అదేవిధంగా ప్రజా సమస్యలు కొన్నింటిని వెలుగులోకి తెచ్చారు. ఏ విధంగా చూసుకున్నా కార్యకర్తలను ఉత్సాహ పరిచి, తనదైన శైలిలో వారిని ఒప్పించి మెప్పించి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరులో ముఖ్యంగా కుప్పంలో పోయిన చోటే పరువు దక్కించుకోవాలన్న తాపత్రయంతో 70 ఏళ్లు పైబడిన చంద్రబాబు ఆరాటపడుతున్నారు.