రాజకీయ నాయకులు నిజంగా చెప్పే మాటలకు.. చేసే పనులకు అస్సలు పొంతనే ఉండదు. గతంలో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఏం చెప్పారు ? ఒక్కసారి గుర్తు చేసుకోండి.
రాజకీయ నాయకులు నిజంగా చెప్పే మాటలకు.. చేసే పనులకు అస్సలు పొంతనే ఉండదు. గతంలో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఏం చెప్పారు ? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్రజలందరూ డిజిటల్ బాట పట్టాలని, వీలైనంత వరకు నగదు వాడకుండా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు పూర్తి చేయాలని చెప్పారు కదా. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం చేస్తున్న పని మాత్రం దాన్ని ప్రోత్సహించేలా లేదు. నిరుత్సాహ పరిచేలా ఉంది. ఇంతకీ విషయం ఏమిటో చెప్పలేదు కదా.. అయితే చదవండి..
అప్పట్లో మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తమ సైట్‌లో ప్రయాణికులు బుక్ చేసుకునే రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిలను ఎత్తివేసింది కదా. దాంతో 2016 నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ ఆ చార్జిలను వసూలు చేయడం లేదు. అయితే అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ సదరు సర్వీస్ చార్జిలకు అయ్యే మొత్తాన్ని ప్రయాణికుల తరఫున తామే భరిస్తామని, ఆ మేరకు ఆ మొత్తాన్ని ఐఆర్‌సీటీసీకి చెల్లిస్తామని చెప్పింది.
అయితే ప్రయాణికులపై విధించే సర్వీస్ చార్జిలను ఎత్తివేయడం మూలంగా ఇప్పటి వరకు దాదాపుగా రూ.88 కోట్ల వరకు కేంద్ర ఆర్థిక శాఖ ఐఆర్‌సీటీసీకి బాకీ పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ శాఖ సదరు మొత్తాన్ని చెల్లించలేమని, కావాలంటే ప్రయాణికులపై సర్వీస్ చార్జిలను యథావిధగా విధించుకోండి.. అంటూ ఐఆర్‌సీటీసీకి లేఖ రాశారు. అయితే అసలే నష్టాల్లో ఉన్న ఐఆర్‌సీటీసీకి కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం షాక్ కొట్టేలా చేసింది. దీంతో ఐఆర్‌సీటీసీకి గత్యంతరం లేక ఇకపై ప్రయాణికులపై ఆ సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటే సర్వీస్ చార్జిలను మళ్లీ యథావిధిగా విధించాలని ఆలోచిస్తోంది.
కాగా ఐఆర్‌సీటీసీ సైట్‌లో బుక్ చేసుకునే టిక్కెట్లపై సర్వీస్ చార్జి విధించాలనే నిర్ణయాన్ని ఆ సంస్థ త్వరలో అమలు చేయనుందని తెలుస్తుండగా, త్వరలోనే ఆ సంస్థ ఉన్నతాధికారులు సమావేశమై ఈ విషయంపై చర్చించి అధికారికంగా తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారని సమాచారం. ఈ క్రమంలో ప్రయాణికులు బుక్ చేసుకునే స్లీపర్ క్లాస్ టిక్కెట్లపై రూ.20, ఏసీ క్లాస్ టిక్కెట్లపై రూ.40 సర్వీస్ చార్జిలను త్వరలోనే వసూలు చేస్తారని తెలుస్తోంది. ఇదీ.. మోదీ ప్రభుత్వం చెప్పిన డిజటల్ లావాదేవీల కహానీ.. ఇంత మాత్రానికి పెద్ద నోట్లను రద్దు చేయడం, డిజిటల్ లావాదేవీలను చేయమని చెప్పడం ఎందుకనేది.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది..!