పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చేసిన బీజేపీ అధిష్టానం.. తెలుగు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను కూడా ఛేంజ్ చేసింది.. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా జీ కిషన్ రెడ్డిను నియమించింది. అయితే.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్న సోము వీర్రాజు, బండి సంజయ్‌లకు మరో బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టనుంది. అయితే.. ఈ సందర్భంగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఇన్నిరోజులు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండటం గర్వకారణమని తెలిపారు. తన లాంటి సామాన్య కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు సంజయ్ ధన్యవాదాలు చెప్పారు. హైకమాండ్ అంచనాలను అందుకున్నానని భావిస్తున్నానని, అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు సహకరించిన పార్టీ పెద్దలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తన బాధ్యతను నిర్వర్తించానని, తెలియక ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించాలన్నారు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంజయ్ స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు ఢిల్లీలో నడ్డాతో ముగిసిన భేటీ అనంతరం సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.