టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి పరీక్షా కేంద్రంలో గర్భిణి మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో శుక్రవారం జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్న భయంతో రాధిక అనే అభ్యర్థి పరీక్షకు ముందుగానే చేరుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రశ్నాపత్రం బదులుగా మరో ప్రశ్నాపత్రం అందజేసి నిరుద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో కొనసాగుతుండటం బాధాకరమని విమర్శించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ ఉదంతం మరువకముందే టెట్ ప్రశ్నాపత్రం మార్పు పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రతిపక్షాలపై బురద చల్లుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ట్విట్టర్ టిల్లు సొంత జిల్లాలో అధికారులు చేసిన నిర్వాకంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఇలాంటివి పునరావ్రుతం కాకుండా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.