తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఈ ఇద్దరికీ కేటీఆర్ మంగళవారం రోజున లీగల్ నోటీసులు పంపారు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆ నోటీసులలో పేర్కొన్నారు.
బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులపై తాజాగా బండి సంజయ్ స్పందించారు. నీ పరువు 100 కోట్లు అయితే.. 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల పరువుకు ఎంత వెలకడతావని ప్రశ్నించారు. కేటీఆర్.. నీ ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. కేటీఆర్ ను బర్తరఫ్ చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేటీఆర్ నోటీసులను లీగల్ గా ఎదుర్కొంటామని.. పేపర్ లీకేజీ కేసును ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.