ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అర్హ వెండితెరకు పరిచయం అవుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆర్హ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అల్లు కుటుంబం నుండి నాలుగో తరం వారసురాలు అల్లు అర్హ శకుంతలం సినిమాతో వెండి తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది చిత్ర బృందం. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 5 భాషల్లో విడుదల కాగా సమంత ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. అల్లు అర్హ చిన్ననాటి భరతుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాలో అర్హ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని ప్రశ్నకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
“శాకుంతలం చిత్రంలో భరతుడి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర.. ప్రీ క్లైమాక్స్ లో ఈ పాత్ర వస్తుంది. దానికి స్టార్ కిడ్ అయితే బావుంటుందనిపించింది. నీలిమ గుణ వెంటనే ఇన్ స్టాలో బన్ని షేర్ చేసిన క్యూట్ అర్హ ఫోటోని చూపించింది. వెంటనే బన్నీని సంప్రదించగా అతడు ఒప్పుకోవడం చాలా ఆనందంగా అనిపించింది అయితే బన్నీ తెలుగు సంస్కృతిని కాపాడే గౌరవించే హీరో.. రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక చిత్రం గుణ చేస్తున్నారంటే ‘దానికి నేనేం చేయాలి?’ అంటూ బన్ని గోనగన్నారెడ్డి పాత్రలో నటించారు.
ఇప్పుడు శాకుంతలం సినిమాలో నటించడానికి అర్హను అడగగా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు మా పాప కావాలా తీసుకోండి అంటూ అప్ప చెప్పాడు అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే అర్హ ఆ ఇంట పెరిగిన తీరు ఆశ్చర్యం కలిగించింది. అల్లు అర్హకు మొత్తం తెలుగు భాష తప్ప ఇంగ్లీషే నేర్పలేదు. మాతృభాషకు వారిచ్చే గౌరవం అలాంటిది. అంత స్పష్ఠంగా అల్లు అర్హ తెలుగు మాట్లాడుతోంది. ఎక్కడా ఆంగ్ల పదం అనేది తన మాటల్లో వినిపించదు. ఒక ఐకాన్ స్టార్ గురించి ప్రస్థావిస్తే.. ఐకాన్ స్టార్ ఊరికినే అయిపోడు. బన్ని ఆలోచనలు కూడా అంతగా ఉంటాయి. పిల్లలకు తెలుగు నేర్పడాన్ని ఫ్యాషన్ గా భావించాడు బన్ని…” అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చారు. అనంతరం మాట్లాడిన దిల్ రాజు.. “చివరి 15 నిమిషాలు అల్లు అర్హ నటన ఇరగదీసింది బన్నీ ని మించిపోయేలా ఈ సినిమాలో అర్హ నటించింది..” అంటూ తెలిపారు.