భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 2న బండి పాదయాత్ర షురూ కానుంది. 24 రోజుల పాటు ఆయన యాత్ర సాగనుంది. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. 328 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.
లక్ష్మీ నరసింహుడు కొలువుదీరిన యాదాద్రిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకుని బండి సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. వరంగల్లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది.
గతంలో చేసిన రెండు యాత్రలకు విభిన్నంగా చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. జనం గోస వినడం.. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్తున్నారు.
బండి సంజయ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఐదు జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగాం, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమతో కలిపి మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 25 మండలాల మీదు యాత్త సాగుతుంది. మొత్తంగా 328 కిలోమీటర్లు బండి సంజయ్ నడువనున్నారు.
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర అనేక చారిత్రాక ప్రదేశాల గుండా కొనసాగనుంది. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, రజాకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని ఖిలాషాపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేటతో పాటు ఐనవోలు మల్లన్న ఆలయ ప్రదేశాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈసారి అనేక గిరిజన తండాలు, బడుగు బలహీనవర్గాల ప్రభావం ఉన్న ప్రాంతాల మీదుగా యాత్ర చేయనున్నారు.