తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కింద ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ ఫలితాల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. చాలామంది.. ఫెయిలయ్యారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిన్న నల్గొండ జిల్లాలో విద్యార్థి మార్కులు తక్కువ వచ్చినందుకు.. ఆత్మహత్య చేసుకుంది. అయితే దీనిపై తాజాగా బండి సంజయ్ కుమార్ స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పిల్లలు బలవన్మరణాలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎవరు అధైర్య పడవద్దని… ఇంకా ముందు ముందు మంచి భవిష్యత్తు ఉందని… మార్కుల కోసం నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోకూడదని బండి సంజయ్ పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఫెయిల్ అయిన విద్యార్థుల ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉండటం దీనికి నిదర్శనమన్నారు. తన చావుకు కారణం అంటూ కేటీఆర్ పేరు చెబుతూ ఓ విద్యార్థి ట్వీట్ చేయడం.. చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు విఫలమైందోనని మనకు అర్థం అవుతుంది అని ఆగ్రహించారు బండి సంజయ్.