తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సజంయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఓ విద్యార్థిని చితకబాదాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర
గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటు చేసుకున్నది. ఇదే యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచారు. నానా భూతులు తిడుతూ విద్యార్థిని సాయి భగీరథ్‌తో పాటు అతని స్నేహితులు కలిసి చితకబాదుతూ, ప్రాంతం పేరుతో దూషించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం వీడియోలో కనిపిస్తున్నది. పైగా మంత్రికి చెప్పినా నన్నేం పీకలేరంటు రంకెలు వేయడం వీడియోలో చూడొచ్చు.
విద్యార్థిని తీవ్రంగా కొడుతూ, దుర్భాషలాడుతూ ఈ ఘటన మొత్తం వీడియో తీయడం చూస్తే.. తన తండ్రి అండ చూసుకొని తనను ఎవరూ ఏం చేయలేరన్న లెక్కలేని తనం కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆది నుంచి వివాదాస్పదుడిగా పేరున్న బండి సంజయ్ తనయుడు గతంలోనూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతూ ఇలాగే గొడవలకు దిగడంతో సంస్థ నుంచి యాజమాన్యం గెంటివేసింది. తాజాగా నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలోని విద్యార్థిని చావబాదాడు. దీంతో.. ప్రతిపక్ష నేత బండి సంజయ్ కొడుకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిపై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించిన బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.