కొత్త కారు కొనాలనుకుని.. అధిక వడ్డీ రేట్లను చూసి ఆగిపోయారు.. అయితే మీకు గుడ్ న్యూస్.. కొత్త కారు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. బ్యాంకు ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 7.25 శాతం వడ్డీకి కార్ల రుణాలిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా 25 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు తగ్గించి ఇక నుంచి ఏడు శాతానికే రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా.. ప్రాసెసింగ్ ఫీజు రూ.1500కు తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే అమలులో ఉంటుందని బ్యాంకు ఆఫ్ బరోడా వెల్లడించింది.
దీంతో పాటు.. ఇప్పటికే కార్లు, టూ వీలర్, ఇతర వాహనాల రుణాలపై వడ్డీరేట్లలో మార్పు ఉండదని బ్యాంకు పేర్కొంది. తమ ఖాతాదారులు చౌకగా కార్లు సొంతం చేసుకోవడానికి వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించామని.. బ్యాంక్ ఆఫ్ బరోడా మార్టగేజ్ అండ్ అదర్స్ రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్టీ సోలంకీ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇంతకుముందు గృహ రుణాలపై వడ్డీరేటు 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ 6.50 శాతం వడ్డీరేటుపై గృహ రుణాలు మంజూరు చేసేందుకు బీవోబీ నిర్ణయం తీసుకుంది.