తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన నివేదికపై అటు ప్రతిపక్షాలు, ఇటు కులసంఘాలు కూడా ఫైర్ అవుతున్నాయి. గతంలో కేసీఆర్ హయాంలోచేపట్టిన సమగ్రకుటుంబ సర్వే నివేదిక ప్రకారం బీసీలు 51 శాతం ఉంటే.. పదేళ్ల తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 46శాతం మాత్రమే అని నివేదిక తేల్చింది.
దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కావాలనే బీసీల సంఖ్యను తగ్గించి చూపించారని ఫైర్ అవుతున్నాయి.పదేళ్ల తర్వాత బీసీల సంఖ్య పెరగాలని ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈనివేదికపై బీసీ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. దీంతో బీసీ కులగణన రిపోర్ట్ అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంశంపై నేడు రాహుల్కు బీసీ సంఘాలు లేఖ రాయనున్నాయి. బీసీల లెక్క తగ్గించడంపై రాహుల్కు లేఖ రాయడంతో పాటు త్వరలో లక్షల మందితో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని బీసీ సంఘాల హెచ్చరించాయి. ఈ నెల 9న ఏది నిజం పేరుతో బీసీ సంఘాలు మీటింగ్కు పిలుపునిచ్చాయి.