డబ్బులు పోయిన రోజులున్నాయి
సినిమాల నుంచి తప్పుకున్న సందర్భాలున్నాయి
అప్పుల నుంచి బయటపడలేని సమయాలూ ఉన్నాయి
వెంట వెంటనే ఓటములు భరించలేనంత ఒత్తిళ్లు
అయినా వెనక్కు పోని వైనం వ్యక్తిత్వం ధీర గుణం
అన్నీ కలిసిన రూపం రోజా సెల్వమణి లేదా రోజా రెడ్డి సొంతం.
ఒక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని అనుకున్నారు. మరో దశలో ఓ అగ్రనేత కారణంగా అవమానాలు అందుకున్నారు. ఈ రెండే కాదు ఇంకా ఎన్నో! చిత్తూరు రాజకీయాలు అనుకున్నంత సులువు కాదు. పొరుగున ఉన్న తమిళ ప్రాంతం ఆ ఊరికి అంటే నగరికి సరిహద్దు. ఆమెకు తమిళం వచ్చు. అనర్గళంగా మాట్లాడడం వచ్చు. భర్త సెల్వ ఇమేజ్ కూడా ఆమెకు కలిసి రావడంతో ప్రజలను కలుపుకునిపోవడం తెలుసు. అయినా కొన్ని కారణాల రీత్యా ఆమె అసమ్మతిని ఎదుర్కొన్నారు కూడా ! అయినా ఆమె నమ్మిన సిద్ధాంతం ఒక్కటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ జగనన్న కు అండగా ఉండాలని భావించారు. ఆ విధంగానే అసెంబ్లీలో ఆ రోజు టీడీపీ లీడర్లను ఢీ కొన్నారు. సస్పెండ్ అయ్యారు. అవమానం పొందారు. అసహ్యకర రీతిలో అసభ్యకర రీతిలో కొందరు మాటలు అన్నా వాటికీ కౌంటర్లు ఇచ్చారు.
కొన్ని సార్లు తన ప్రవర్తన కారణంగానే అఫెండ్ అయిన సందర్భాలనూ చూశారు. అవి కూడా ఆమె ఇమేజ్ ను తగ్గించాయి. విమర్శలకు తావిచ్చేలా చేశాయి. ఇన్ని జరిగినా కూడా ఆమెను నచ్చిన వారు ఉన్నారు. ఆమెను మెచ్చుకున్న వారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె కు కష్టం అంటే ఆదుకున్న శ్రేయోభిలాషులు ఉన్నారు. ఇవన్నీ రోజా గెలుపునకు కారణం. ఇవాళ మంత్రి పదవి వరించేందుకు కారణం. నటన నుంచి తప్పుకుంటున్నాను.. జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నాను.. ఇకపై తెరపై కనిపించను అని ఆమె చెప్పడంతో చాలా మంది నిరుత్సాహం చెందుతున్నారు. కానీ ప్రతిష్టాత్మక పదవిలో ప్రజా ప్రభుత్వం నడవడిలో కీలకం కానుండడం సంతోషదాయకమేనని అంటున్నారు. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు అభిమానులు.
నల్లగా ఉన్నావు నటివి కావు అని అన్నారు ఆమెను ఉద్దేశించి.. నలుపే గెలుపు అని నిరూపించారు. నీకు నటన రాదు అని కూడా అన్నారు. నటనతోనే సంబంధిత ప్రతిభతోనే రాణించారు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు. సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు అని రాయాలి. ఆ రోజు ఆమెకు అన్నలు అండగా ఉన్నారు. తరువాత భర్త అండగా ఉన్నారు. ఇవాళ ప్రజలు అండగా ఉన్నారు. ప్రేమను పంచే బిడ్డలు అండగా ఉన్నారు. రోజా సెల్వమణి నిజంగానే ఓ సక్సెస్ స్టోరీ. ఏడుపులు నవ్వులు కలగలిపిన జీవితంలో ఆమె ఒక్కరే ఉన్నారా.. ఆమెతో పాటు ఎందరెందరో మంచి వ్యక్తులు ఉన్నారు. అన్నయ్యలు ఉన్నారు. ముఖ్యంగా వారే ఆమె జీవితాన్ని ముందుండి కొంత కాలం నడిపారు. చదువుకునే రోజుల్లో వారే నీడల్లే ఉన్నారు. ఆమెను ఎవ్వరు ఏమన్నా ఒప్పుకునేవారు కాదు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆమె అదేవిధంగా పద్ధతిగా నడుచుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. వ్యక్తిత్వం దెబ్బతినకుండా కాపాడుకున్నారు.
కట్టందం బొట్టందం అని రాశారు ఒక చోట. సూరీడు చుట్టూ భూగోళం రాధమ్మ చుట్టూ గోపాళం అని కూడా రాశారు అదే పాటలో కవి! ఆ విధంగా రోజా తెలుగు సంప్రదాయానికి కొనసాగింపు అయ్యారు. కట్టందం బొట్టందం అని.. ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు కనుక.. రోజా అనే రాధ చుట్టూ సెల్వ అనే గోపాళం తిరుగుతూ తిరుగుతూ ఆమె ఉన్నతికి కారణం అవుతున్నారు. ఆ విధంగా రోజా రాజకీయాల్లో ఎదుగుదల సినిమాల్లో రాణింపు టెలివిజన్ మాధ్యమాల్లో గుర్తింపు వీటన్నింటికీ ఒకే ఒక్క వ్యక్తి కారణం కావడం నిజంగానే విశేషమే!