మనం రోజంతా కస్టపడి ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి అలసిపోయినప్పుడు, మరి ఆ అలసటకి సేదతీరే ప్రశాంతమైన ప్లేస్ ఏది అంటే బెడ్ రూమ్ అని అంటాము. కానీ అదే గదిలో వాస్తు దోషాలు ఉంటే నిద్రకు బదులు మనశ్శాంతి కరువవుతుందట. మీ బెడ్రూమ్లో అడుగుపెట్టగానే తెలియని ఒత్తిడి లేదా చికాకుగా అనిపిస్తోందా? నిద్ర వస్తున్నా నిద్రపోలేకపోతున్నారా ? మరి మీ బెడ్ రూమ్ లో ఈ వస్తువులే అందుకు కారణం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు అక్కడ ఉంచకూడని వస్తువులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్రూమ్లో ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు పగిలిన అద్దాలు ఉండటం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. టెలివిజన్, కంప్యూటర్ వంటి పరికరాలు నిద్రకు భంగం కలిగించడమే కాకుండా, గదిలోని ప్రశాంతతను దెబ్బతీసే విద్యుదయస్కాంత కిరణాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదని వాస్తు చెబుతోంది.
నిద్రిస్తున్నప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే అది అనారోగ్యానికి మరియు దంపతుల మధ్య కలహాలకు దారితీస్తుంది. అలాగే మూలల్లో చెత్తను పేరుకుపోనివ్వడం లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి మానసిక ఆందోళనలను కలిగిస్తుంది.

బెడ్రూమ్లో మనం ఉంచే చిత్రపటాలు కూడా మన ఆలోచనా తీరును ప్రభావితం చేస్తాయి. యుద్ధం చేస్తున్నట్టున్న బొమ్మలు ఏడుస్తున్నట్టుండే చిత్రాలు లేదా ఒంటరితనాన్ని ప్రతిబింబించే పెయింటింగ్స్ గదిలో అస్సలు ఉండకూడదు.
వీటికి బదులుగా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు లేదా జంట పక్షుల చిత్రాలను ఉంచడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక అందరు చేసే పిచ్చి పని మంచం కింద అనవసరమైన సామాన్లు, పాత ఇనుప వస్తువులు లేదా చెప్పులు ఇలా పనికి రాని వాటిని అక్కడ పెట్టటం. దీని వాళ్ళ నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. మంచం కింద ఖాళీగా ఉంటేనే శక్తి ప్రవాహం సాఫీగా జరిగి మీరు గాఢ నిద్రలోకి జారుకోవడానికి వీలవుతుంది.
చివరగా బెడ్రూమ్ అనేది కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు, అది మన మనసుని రీఛార్జ్ చేసే కేంద్రం. గదిలో కాంతి ధారాళంగా వచ్చేలా చూడటం, ఆహ్లాదకరమైన రంగులను ఎంచుకోవడం మరియు వాస్తుకు విరుద్ధమైన వస్తువులను తొలగించడం ద్వారా అద్భుతమైన మార్పులను గమనించవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న విషయాలు వాస్తు శాస్త్ర నిపుణులు మరియు సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి. వ్యక్తిగత విశ్వాసాలను బట్టి వీటిని అనుసరించవచ్చు.
