ఆరు నెల‌ల ముందు.. త‌ర్వాత‌.. టీడీపీ పాలిటిక్స్ చిత్రం గురూ!

-

ఏపీ ప్ర‌ధాన విప‌క్షం టీడీపీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఒక‌దానిపై ఒక‌టి ఎదురు దెబ్బ‌లు త‌గులు తుండ‌డంతో ఆ పార్టీ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి ఉందా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచి రెండోసారి కూడా అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నించిన టీడీపీ.. ఈ క్ర‌మంలో నే అనేక ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెచ్చింది. అదేస‌మ‌యంలో ఏపీ ద్రోహి కేసీఆర్‌తో జ‌గ‌న్ సావాసం చేస్తున్నా రంటూ.. సెంటిమెంటు అస్త్రాన్ని ప్ర‌యోగించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. ప‌సుపు-కుంకుమ ప్ర‌భావం అస‌లే క‌నిపించ‌లేదు.
పోనీ.. అభ్య‌ర్థుల సెంటిమెంటు ఏక్క‌డైనా వ‌ర్క‌వుట్ అవుతుందా? అంటే అది కూడా ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో టీడీపీ కేవలం 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఇక‌, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో సీనియ‌ర్లు పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. కీల‌క‌మైన నాయ‌కులు.. ప్ర‌జాద‌రణ ఉన్న నేత‌లు కూడా బాబుకు ఎడ‌మొహం పెడ‌మొహంగా మారిపోయారు. దీంతో అసలు రాజ‌కీయంగా టీడీపీ తీవ్ర స్థాయిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. జిల్లాల వారీగా చూసుకున్నా.. యాక్టివ్‌గా ఉన్న నాయ‌కులు ఓడిపోవ‌డం, వార‌సుల‌ను గెలిపించుకోవాల‌న్న నాయ‌కుల వ్యూహాలు పార‌క‌పోవ‌డంతో పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయింది.

తాజాగా గ‌డిచిన వారం రోజుల్లో మ‌రిన్ని చేదు ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు చ‌విచూస్తున్నారు. కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కీల‌క‌మైన నాయ‌కుడు, కాపు వ‌ర్గానికి చెందిన తోట త్రిమూర్తులు పార్టీ మారి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. త‌న‌కు పార్టీ నుంచి స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌నే మాన‌సిక వేద‌న‌తో పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

దీనిని క‌ప్పిపుచ్చుకునేందుకు, డ్యామేజీని తక్కువ చేసి చూపేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. కోడెల మేన‌ల్లుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచార‌ణ ప్రారంభ‌మైంది. ఇదిలావుంటే, తాజాగా పార్టీ సీనియ‌ర్ నేత‌, నారిమిల్లి శివ‌ప్రసాద్ మృతి చెంద‌డం పార్టీకి మ‌రింత లోట‌నేది వాస్త‌వం. ఇలా టీడీపీ అనూహ్య రీతిలో ఓ ఆరు మాసాల ముందున్న హిస్ట‌రీని కోల్పోవ‌డం చూస్తే.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేర‌నే వ్యాఖ్య‌లు నిజ‌మ‌వుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version