మరి కొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు జీవోలను విడుదల చేయాలని బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మేడిపల్లి మండలం పొరుమల్ల గ్రామంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని విమర్శించారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.
ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 33శాతం మాత్రమే పూర్తి అయిందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం లో మూడు ఉప గ్యారెంటీలు ఉన్నాయని రూ. 500 లకే సిలిండర్, ప్రతి మహిళలకు రూ. 2,500 పెన్షన్ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతాయి అని ఆయన ప్రశ్నించారు.వారం, పది రోజుల్లోనే లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తప్పించుకునే అవకాశాలున్నాయని అన్నారు.