ఇటీవల పుంగనూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఉమ, కిశోర్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లను సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు వినేందుకు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అప్పటివరకు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ లను అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. పుంగనూరు ఘటనలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరగా.. 246 మందికిపైగా టీడీపీ శ్రేణులను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. అన్ని కేసుల్లోనూ ఏ1గా పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డిని చూపారు. కాగా.. పుంగనూరు బండ్లపల్లెకు చెందిన వి.చిన్నరెడ్డెప్ప(59), రొంపిచెర్ల మండలం మోటుమల్లెలకు చెందిన ఎం.చెంగల్రాయనాయుడు (55), ఎం.వెంకట్రమణ నాయుడు(66)ను మంగళవారం అరెస్టుచేసి రిమాండుకు పంపారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 74కు చేరింది. 7 కేసుల్లో 246 మందిని నిందితులుగా చూపగా.. ఇంతరులు జాబితాలో ఇంకెంతమంది కార్యకర్తలు, నాయకుల పేర్లు చేరతాయోనన్న ఆందోళనలో టీడీపీ వర్గాలు ఉన్నాయి.