బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భాజపా, జేడీయూ మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో మంగళవారం జరుగుతున్న శాసనసభ్యుల భేటీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన పట్నాలో జేడీయూ శాసనపక్ష సమావేశం నిర్వహించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం నితీశ్ నివాసంలో జరుగుతున్న భేటీకి హాజరయ్యారు.
మరోవైపు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేల భేటీకి వామపక్ష పార్టీలు సైతం హాజరయ్యాయి. లాలూ ఇంట్లో జరుగుతున్న ఈ భేటీకి ఎమ్మెల్యేల ఫోన్లను అనుమతించడం లేదు.
భాజపాకు గుడ్‌బై చెప్పేసి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా నితీశ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను సైతం ప్రభుత్వంలో భాగం చేసుకోవాలని నితీశ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై సోనియా గాంధీతో సీఎం చర్చించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.