సచివాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ పిలిచారు.. కానీ నో చెప్పా : నితీశ్ కుమార్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇతర కీలక నేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ బిహార్ సీఎం నితీశ్ కుమార్​ను కూడా ఆహ్వానించారు. కానీ ఆయన ఈ కార్యక్రమానికి రానని సున్నితంగా తిరస్కరించారు. దానికి గల కారణాలను కూడా వివరించారు. అదేంటంటే..?

కేసీఆర్‌ సభకు హాజరైనంత మాత్రాన.. కాంగ్రెస్‌తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని తెలిపారు.  తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తనను ఆహ్వానించారని.. అయితే తనకిక్కడ చాలా పనులు ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారు.

‘పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సైతం ఈ విషయం చెప్పాలని కేసీఆర్‌ కోరారు. ఈ నేపథ్యంలో తన బదులు తేజస్వీ యాదవ్‌, జనతాదళ్‌(యునైటెడ్‌) అధ్యక్షుడు లలన్‌ సింగ్‌లు ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పాను.’ అని నితీశ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం  బహిరంగ సభ జరుగనుంది. ఖమ్మంలో నిర్వహించిన భారాస సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండేవాడిని కాదని గతంలో నీతీశ్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version