ఇప్పటికే కరోనా ప్రపంచం వణికిపోతుంటే.. కొత్తగా రోజురోజుకూ రకరకాల వైరస్‌లు, స్ట్రెయిన్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటితో చాలా ప్రమాదమని డాక్టర్లు తెలుపుతున్నారు. ఇప్పుడు చైనాలో ఓ ప్రమాదకరమైన వైరస్ సోకిన కేసు నమోదైంది. ఇలాంటి కేసు ప్రపంచంలోనే తొలి కేసు. దీంతో అంతా ఉలిక్కిపడుతున్నారు.
జియంగు ప్రొవైన్స్ కు చెందిన 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ హెచ్10ఎన్ 3 అనే బర్డ్ ఫ్లూకి చెందిన స్ట్రెయిన్ సోకింది. ఇలా వ్యక్తికి ఈ వైరస్ సోకడం ఇదే మొదటిసారి. ఇతనికి కొన్ని వ్యాధి లక్షణాలు ఉండటంతో ఏప్రిల్ 28 హాస్పిటల్‌లో చేరారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతనికి హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సోకినట్టు మే 28న గుర్తించారు. అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు నార్మల్‌గా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే ఇది చాలా అరుదైన కేసు అని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇది కోళ్ల నుంచి సోకినట్టు తెలుస్తోంది. అయితే ఇది వ్యక్తుల నుంచి ఇంకొకరికి సోకదని డాక్టర్లు వివరిస్తున్నారు.