రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బేరసారాలకు పాల్పడుతోందని విపక్షాల పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. ఎన్నికల సంఘం, రాజ్యసభ ప్రధాన కార్యదర్శి ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కమల్‌లో భాగంగా భాజపాయేతర ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు. గురువారం భోపాల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా భేటీ అయ్యారు. అనంతరం సిన్హా మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది గిరిజన ఎమ్మెల్యేలపై బీజేపీ కన్ను పడిందన్నారు.
క్రాస్ ఓటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఆపరేషన్ కమల్‌కు సరైన పేరు ‘ఆపరేషన్ మురికి’ అని పెడితే బాగుంటుందన్నారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రతిపక్షాల నడుమ మనస్పర్థలు తెచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు శ్రీలంక పరిస్థితి రాదన్నారు. విదేశీ మారక నిల్వలు, డాలరుతో పోల్చితే రూపాయి విలువ నానాటికీ తగ్గుతుందని యశ్వంత్ సిన్హా తెలిపారు.