మైకు దొరికిందన్న ఉత్సాహమో లేక ఇలా మాట్లాడితేనే ఫాలోయింగ్ పెరుగుతుందన్న బ్లైండ్ అత్యుత్సాహమో తెలియదు కానీ… జనాలు అమాయకులు కాదు అన్న విషయాన్ని ఇప్పటికీ అందరు టీడీపీ నేతలు గ్రహించడం లేదు సరికదా.. ఇంకా ప్రజల జ్ఞాపకశక్తికి పరీక్షలు పెడుతూ.. తమ అజ్ఞానాన్ని బయటపెడుతూనే ఉన్నారు.. ఫలితంగా సృహలో ఉండే మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు కలిగిస్తున్నారు!
ఈ క్రమంలో తాజాగా మైకందుకున్నారు ఏపీ టీడీపీ కొత్త కథానాయకుడు అచ్చెన్నాయుడు! ఈయన ఎత్తుకున్న టాపిక్ పోలవరం. అవును… మైకందుకున్న అచ్చెన్న… “ఏపీ ప్రజల జీవనాడి పోలవరం. పోలవరం పూర్తయితే ఏపీ భవిష్యత్ బాగుంటుంది.. వైసీపీ ప్రభుత్వం పోలవరం భవిష్యత్ ను అంధకారం చేసింది. టీడీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..” అని ముగించారు!
అసలు పోలవరం అనేది ఏపీ ప్రజల జీవనాడి అనే సృహ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ నేతలకు ఉండి ఉంటే.. ఆ ఐదేళ్లలోనే పోలవరం పూర్తయ్యేది కదా! “సర్ ఆర్ధర్ కాటన్, శ్రీకృష్ణ దేవరాయుల తర్వాత చంద్రబాబునే ఏపీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని.. రాసుకో జగన్ పోలవరం పూర్తిచేసి తీరుతాం” అని సినిమా డైలాగుల లెవెల్లో డైలాగులు పేల్చిన టీడీపీ నేతలు… నేడు జగన్ పోలవరం భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని అనడం ఏమిటి? అజ్ఞానం కాకపోతే!
అడిగేవాడు లేక టీడీపీ నేతలు ఇలా పెట్రేగిపోతున్నారా లేక సృహ లోపించడం వల్ల ఇలా మాట్లాడుతున్నారా అనేది అర్ధం కావడం లేదు ఏపీ వాసులకు. అది జాతీయ ప్రాజెక్టు.. కేంద్రం కట్టి ఇవ్వాల్సిన ప్రాజెక్టు.. మరి అలాంటప్పుడు తగుదునమ్మా అంటూ తెచ్చుకుని, కమిషన్లకు కక్కుర్తి పడి ఆ ప్రాజెక్టును అటూ ఇటూ కాకుండా చేసింది టీడీపీ నేతలే కదా!
బాబు హయాంలో “సోమవరం – పోలవరం” అంటూ మంగళవారం కబుర్లు చెబుతూ.. కాపర్ డ్యాం కు ప్రాజెక్టు పరిపూర్ణ పనులకు తేడా తెలియకుండా మాట్లాడిన టీడీపీ నేతలు… ఇప్పుడు జగన్ వల్ల పోలవరం ఆగింది, ఆగుతుంది, అంధకారమవుతుంది అనడం ఏమిటో వారికే తెలియాలి?
జనాలు ఐదేళ్లకోసారి ప్రశ్నిస్తారన్న సృహ 2019 ఎన్నికల ఫలితాల అనంతరమైనా కలగకపోవడం టీడీపీ నేతల మానసిక పరిస్థితికి అద్దం పడుతుందనే కామెంట్లు ఈ సందర్భంగా పడుతున్నాయి! ఏది ఏమైనా… ఆయాసం ఆవేశం కలగలిసి అచ్చెన్న ఇకపై అయినా తప్పులు తెలుసుకోవాలి.. సృహలో ఉండి మాట్లాడాలని ఆయన అభిమానులు, ఏపీ వాసులు కోరుకుంటున్నారు!