బీజేపీకి దీపావళి కాస్త ముందే వచ్చిందా

-

బీహార్‌లో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎగ్జిట్‌పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. దుబ్బాకలో థ్రిల్లర్‌లో కమలం గెలుపు కొత్త చరిత్రకు బాటలు వేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏడాదిన్నర క్రితం నరేంద్రమోడీ నాయకత్వం మీద వెల్లువెత్తిన ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాయి తాజా ఎన్నికల ఫలితాలు. బీహార్‌లో గత ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ.. ఈసారి చెలరేగింది. కరోనా కట్టడి, దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం, దేశానికి సమర్థ నాయకత్వాన్ని అందించడం లాంటి అంశాల్లో నరేంద్రమోడీ మీద ఉన్న విశ్వాసం చెక్కు చెదరలేదని నిరూపిస్తున్నాయి తాజా ఎన్నికల ఫలితాలు.

మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ మ్యాజిక్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని 20 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఇబ్బంది లేనట్లే. కర్నాటక, జార్ఖండ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ జ్యోతిరాదిత్య సింధియా మ్యాజిక్ బీజేపీకి ప్లస్ అయింది.

బీహార్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయాలు బీజేపీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయం పార్టీ శ్రేణులకు విపరీతమైన కిక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. గుజరాత్‌లో జరిగిన 8 అసెంబ్లీ సీట్లు కమలం ఖాతాలో పడ్డాయి. తాజా విజయాలతో బీజేపీ నేతలు త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడుపై దృష్టి పెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టమైన వ్యవహారంగా మారవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version