ఖమ్మం నేతలకు గేలం వేస్తున్న కమలదళం..అందుకేనా కేటీఆర్ హడావిడి టూర్

-

దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలు కమల దళానికి జోష్ నిచ్చాయి. అదే ఊపుతో వచ్చే ఏడాది జరుగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు అక్కడ కమలం ట్రాక్ రికార్డ్ గొప్పగా ఏం లేదు. దీంతో కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా స్థానిక సమస్యలపై దూకుడు ప్రదర్శిస్తోందట. అసంతృప్తులను ఆకర్షించే పనిలో కూడా బిజెపి బిజీగా ఉందట.

ఓ పక్క దుబ్బాక, మరోపక్క జీహెచ్ ఎంసీ ఫలితాలు కమల దళానికి అంతులేని ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ఇతర పార్టీల అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తుంది.ఖమ్మం కార్పోరేషన్ కి వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి వరకు ఈ కార్పొరేషన్ పదవీ కాలం ఉంది. ప్రస్తుతం ఎస్టి జనరల్ గా ఉన్న మేయర్ పదవి ఇప్పుడు ఓసి జనరల్ మహిళ స్థానం కు రిజర్వ్ అయ్యింది. గత ఎన్నికల సమయంలో తుమ్మల నేతృత్వంలో కార్పోరేషన్ ను టీఆర్ఎస్ దక్కించుకొంది.

ఇప్పుడు సైతం అదే ఊపుతో కార్పొరేషన్ ను కైవశం చేసుకోవాలని అధికార పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా మంత్రి కేటీఆర్ తో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో బీజెపీ కూడా దూకుడు పెంచింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. పదకొండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే డిపాజిట్ దక్కింది. అయితే, ఈ సారి మాత్రం ఉద్యమాలతో పాటు ఆకర్ష్ మంత్రాన్ని నమ్ముకుని జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.

ఓ పక్క కమ్యూనిస్టుల తరహాలో స్థానిక సమస్యలపై ఉద్యమాలకు దిగుతూ, మరోపక్క అసంతృప్తులను ఆకర్షించే పనిలో దూకుడుగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోళ్లపాడు చానల్ ఆధుణీకరణ పేరుతో అధికార పార్టీ వంద కోట్ల అభివృద్ది పనులను చేపడితే నిర్వాసితుల కోసం బిజెపి ఆందోళనలు చేపట్టి, బిసి కమీషన్ ని ఖమ్మం తీసుకొచ్చింది. ఆందోళనలకు మద్దతుగా బిజెపి రాష్ర్ట అద్యక్షుడు సంజయ్ ను కూడ పిలిపించింది.

మరో వైపు కాంగ్రెస్ తో పాటు అధికార పార్టీలో ఉన్న పలువురు అసంతృప్తులు బిజెపి వైపు చూస్తున్నారనే టాక్ ఉంది. ఈ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కమల దళం ప్రయత్నాలు చేస్తోందట. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ వేవ్ సైతం పక్కనపెట్టి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి తనతో పాటు జిల్లాలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఆ తర్వాత మారిన పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమయ్యాడంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. అప్పటి నుంచి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్న పొంగులేటి పై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఈరోజు కేటీఆర్ పొంగులేటి ఇంటికి వెళ్లీ మరి తనతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు వెంట తీసుకెళ్లారు.

ఖమ్మం నుంచి వివిధ పార్టీల అసంతృప్త నేతల పేర్లతో ఓ లిస్టును తయారు చేసుకుని పార్టీ అధిష్టానానికి బిజెపి నేతలు ఇచ్చారట. వారితో అధిష్టానం కూడ చర్చలు జరుపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా ఖమ్మం కార్పోరేషన్ లో పాగా వేయాలనే లక్ష్యంతో బిజెపి పనిచేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version