విద్వేశపూరిత రాజకీయాలకు పునాది బీజేపీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు గొంతెత్తిన వారిని దేశ ద్రోహులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్రించి నిర్భందిస్తున్నారని విమర్శించారు.’కాంగ్రెస్‌ను నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్’ అంటూ మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు.
ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గాంధీ కుటుంబానిది అని అన్నారు.కాంగ్రెస్ మొదటి నుంచి ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉందని చెప్పారు. అర్బన్ నక్సల్స్ అంటూ ప్రధాని మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ సమగ్రత, సమైక్యత విషయంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని అవినీతిపరులు, విభజన వాదులు, అర్బన్ నక్సలైట్‌లు అనడం ప్రధాని స్థాయికి తగ్గ మాటలు కావు అని భట్టి హితవు పలికారు.