బీజేపీ నేత కుటుంబాన్ని ఉగ్రవాదులు హత్య చేసారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు వాసిం బరి, ఆయన తండ్రి, సోదరుడు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో తమ దుకాణంలో కూర్చొని ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్‌కు 10 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని జిల్లా దవాఖానకు తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వెల్లడించారు. ముగ్గురిని తలపై కాల్చారని వైద్యులు తెలిపారు.
వాస్తవానికి వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబ్బందితో రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో రక్షణ సిబ్బంది ఎవ్వరూ లేరని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఆ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొత్తం 8 మంది భద్రతా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. వాసిం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ట్వీట్ చేశారు.