తెలంగాణ బీజేపీ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది..అధికార టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి ఎప్పటికప్పుడు ఊహించని ఎత్తులతో ముందుకొస్తుంది…ఇప్పటికే పలు స్ట్రాటజీలతో బీజేపీ రాజకీయం చేస్తుంది. రాష్ట్రంలోని నేతలే కాకుండా…కేంద్రంలోని బీజేపీ నేతలు సైతం తెలంగాణపై బాగా ఫోకస్ పెట్టి రాజకీయం నడుపుతున్నారు. ఆఖరికి మోడీ, అమిత్ షా సైతం తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
అంటే అందివచ్చిన ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు…ఎలాగైనా గులాబీ పార్టీని నిలువరించాలనే చూస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ…సీనియర్ నేత ఈటల రాజేందర్ ని ముందు పెట్టి రాజకీయం నడపటానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అసలు తెలంగాణలో ఈటల పేరు తెలియని వారుండరు…ఆయన టీఆర్ఎస్ లో ఎన్నో ఏళ్ళు పనిచేశారు..కేసీఆర్ సన్నిహితుడుగా ఉన్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్…ఈటలని పార్టీ నుంచి బయటకెళ్లెలా చేసిన విషయం తెలిసిందే.
ఇక బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్ళీ హుజూరాబాద్ లో పోటీ చేసి టీఆర్ఎస్ ని చిత్తుగా ఓడించి ఈటల సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత తెలంగాణలో బీజేపీ మరింత దూకుడుగా రాజకీయం చేస్తూ వస్తుంది. కాకపోతే బలమైన ఈటలని సరిగ్గా వాడుకోవడంలో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు. ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఈటలని రాష్ట్ర స్థాయిలో తిప్పలేకపోయింది.
అసలు ఈటల ద్వారా…తెలంగాణలో మెజారిటీ స్థాయిలో ఉన్న బీసీ వర్గాలని ఆకట్టుకునే కార్యక్రమాలు చేయలేదు. దీంతో ఈటల సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి…తెలంగాణలోని రాజకీయ పరిస్తితులని వివరించారు.ఇక ఇదే సమయంలో ఈటలకు కీలక పదవి ఇవ్వాలని షా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది…ఆయన ద్వారా తెలంగాణలో బీజేపీని మరింత బలపడేలా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్తితులు ఈటలకు బాగా తెలుసు. అలాగే టీఆర్ఎస్..ప్లస్ ఏంటి…మైనస్ ఏంటి అనేది కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెంచి..టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనేది షా ప్లాన్ గా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఇకపై ఈటలని బీజేపీ ఏ స్థాయిలో వాడుకుంటుందో?