హ‌మారా స‌ఫ‌ర్ : ఏపీకి వద్దు.. యూపీకి ముద్దు.. ఉచిత విద్యుత్

-

వ్య‌వ‌సాయ రంగ విష‌య‌మై సేద్య‌గాడికి ఊత‌మిచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని యూపీలో కూడా అమ‌లు చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని తన ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించింది. అదే విధంగా గోధుమ,వరి పంట‌లకు సంబంధించి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చింది. ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ త‌న ఎన్నిక‌ల మ్యానిఫెస్టో విడుద‌ల చేసింది.

వాస్త‌వానికి దీనిని ఆదివార‌మే విడుద‌ల చేయాల్సి ఉన్నా గాన కోకిల,భార‌త ర‌త్న ల‌తామంగేష్క‌ర్ ఆక‌స్మిక మ‌ర‌ణం కార‌ణంగా ఆ కార్య‌క్ర‌మాన్ని రద్దు చేసుకున్న విష‌యం విధిత‌మే! దీంతో ఆ రోజు ల‌ఖ్ న‌వూకు చేరుకున్న అమిత్ షా కూడా ల‌తాజీకి మ‌ర‌ణ విషాదం ఉన్నందున మ్యానిఫెస్టో విడుద‌ల చేయ‌కుండా ఉండిపోయారు. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో మ్యానిఫెస్టోను విడుద‌ల చేశారు. రేపు అక్క‌డ మొద‌టి విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక యూపీ ప్ర‌భుత్వం అమ‌లు చేయాలనుకుంటున్న ఉచిత విద్యుత్ ప‌థ‌కానికి సంబంధించి ఇప్ప‌టికే అనేక సార్లు పార్టీ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అయితే ఉచిత విద్యుత్ హామీ అమ‌లుపై ఏపీతో ఒక విధంగా ఇంకా చెప్పాలంటే పొరుగున ఉన్న తెలంగాణ‌తో ఒక విధంగా న‌డుచుకుంటున్న కేంద్రం ఇప్పుడెలా ఈ హామీ ఇస్తుంద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ఈ ద‌శ‌లో వ్య‌వ‌సాయ మీట‌ర్ల ఏర్పాటుపై రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఒప్పించిన ప్ర‌య‌త్నం అయితే చేసింది. కానీ తెలంగాణ విష‌య‌మై నెగ్గ‌లేక‌పోయింది. ఆంధ్రా మాత్రం మోడీ చెప్ప‌గానే విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.

ఈ విష‌యంలో ఎటువంటి వాగ్వాదాల‌కు దిగ‌లేదు స‌రిక‌దా వ్య‌వ‌సాయానికి విద్యుత్ మీట‌ర్ల బిగింపున‌కు సంబంధించి కేంద్రం ఇవ్వాల‌నుకున్న నిధులు ఎంతో తెలుసుకుని, అవి కూడా స‌కాలంలోనే విడుద‌ల‌య్యేలా చేసి, సంబంధిత ఆర్థిక ల‌బ్ధి పొందారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో హ‌రీశ్ రావు స‌హా చాలా మంది వ్య‌వ‌సాయ మోటార్ల‌కు విద్యుత్ మీట‌ర్ల అమ‌రిక‌పై వ్య‌తిరేకించారు.

దీంతో అక్క‌డ కేంద్రం అనుకున్న విధంగా వ్య‌వ‌సాయ మోటార్లు మీట‌ర్ల అమ‌రిక అన్న‌ది సాధ్యం కాలేదు. కానీ జగ‌న్ మాత్రం కేంద్రం చెప్పిన విధంగానే మీట‌ర్లు ఏర్పాటుచేసి, వ్య‌వ‌సాయ విద్యుత్ కు సంబంధించిన మొత్తాల‌ను డిస్కంల‌కు నేరుగా చెల్లించ‌కుండా రైతుల ఖాతాల‌కు చెల్లిస్తున్నారు. లేదా చెల్లించేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో డిస్కంల‌కు నేరుగా చెల్లిస్తే అవి ఆర్థిక భారం నుంచి గ‌ట్టెక్కుతాయ‌న్న వాద‌న‌కు కూడా జ‌గ‌న్ అంగీకారం తెల‌ప‌లేదు. దీంతో కేంద్రం ఏం చెప్పిందో ఎలా చెప్పిందో అదే విధంగా ఏపీ స‌ర్కారు న‌డుచుకుంటోంది. మ‌రి! యూపీ లో వ్య‌వ‌సాయ రంగానికి ఉచిత విద్యుత్ ను ఏ ప్రాతిప‌దిక‌న అందిస్తారో? అందుకు ఏ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version