హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడానికి బీజేపీ పార్టీ అన్నీ అస్త్రాలని సిద్ధం చేసుకుంటుంది. ఈటల రాజేందర్‌ని పార్టీలో చేర్చుకుని బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇక ఈ ఉపపోరులో తన సత్తా ఏంటో చూపించాలని ఈటల చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వరుసపెట్టి సమావేశాలు పెడుతూ ప్రజలని కలుస్తున్నారు.
ఇక ఈటలకు మద్ధతుగా బీజేపీ నేతలు సైతం హుజూరాబాద్‌లో దిగేశారు. ఇప్పటికే అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు కీలక నాయకులు హుజూరాబాద్‌లో మకాం వేశారు. తాజాగా నియోజకవర్గానికి ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించారు. అలాగే ఇద్దరు కో-ఇన్‌చార్జ్‌లని పెట్టారు. ఇక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ అరవింద్‌లతో పాటు పలువురు కీలక నాయకులకు నియోజకవర్గంలోని మండలాల బాధ్యతలు అప్పగించారు.
దీంతో కమలదళం మరింత దూకుడుగా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు కోసం పనిచేయనున్నారు. అయితే అటు కేసీఆర్ సైతం ఎప్పటినుంచో పలువురు మంత్రులని, ఎమ్మెల్యేలని హుజూరాబాద్‌కు పంపించారు. మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు. కాకపోతే ఇంకా పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది తేలలేదు.
తాజాగా పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్‌రెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో కశ్యప్ రెడ్డి బాబాయ్ పురుషోత్తం రెడ్డి పేరు కూడా గులాబీ బాస్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా గానీ హుజూరాబాద్ ఉపఎన్నికల పోరులో ఒక అడుగు కమలదళమే ముందున్నట్లు కనిపిస్తోంది. మరి కమలదళానికి గులాబీ బాస్ ఎలా చెక్ పెడతారో చూడాలి.