కేసీఆర్ తెలంగాణ ప్రజా ధనాన్ని దోచుకున్నారని, కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని, వారు జైలుకు వెళ్ళడం ఖాయమని బీజేపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ జైలుకు పోవుడు గ్యారెంటీ అని బండి సంజయ్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక తాజాగా బండి నాల్గవ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సైతం..అదే తరహాలో కామెంట్స్ చేస్తూ వచ్చారు. జల సొమ్మును లూటీ చేసే వారు జైలుకు వెళ్ల్లాల్సిందేనని మాట్లాడారు.
కేసీఆర్ పెద్ద మోసగాడని పేర్కొంటూ.. ఇలాంటి వారు అధికారంలో ఉండాలా? అని ప్రశ్నించారు. అటు బండి సంజయ్ కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. అటు ఎంపీ ధర్మపురి అరవింద్..కేటీఆర్, కవితని టార్గెట్ చేశారు. ప్రాజెక్టులు ఇవ్వడం, వాటికి కమీషన్లు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటైపోయిందని, ఎనిమిదేళ్లుగా ఆయన పని ఇదేనని ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో మునిగిపోయి రేపోమాపో జైల్లో చిప్పకూడు తినబోయే వ్యక్తి కొడుకుని, కూతురుని తాము సీరియ్‌సగా తీసుకోబోమని మాట్లాడారు.
అయితే కేసీఆర్ అవ్వని లేదా కేటీఆర్, కవితని గాని…బీజేపీ నేతలు పదే పదే జైలుకు పోతారని కామెంట్ చేస్తూనే ఉన్నారు. వారి అవినీతి, అక్రమాల లెక్క తేలుస్తామని అంటారు. కానీ ఇంతవరకు ఆ లెక్కలు ఏంటి? వేటిల్లో అక్రమాలు జరిగాయి అనేది మాత్రం బయటపెట్టారు. జైలుకు వెళ్తారని అంటారు గాని..దానికి తగ్గట్టుగా చర్యలు ఉండవు.
ఇదే అంశాన్ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ నేతలు జైలుకు పంపిస్తామని అంటారు గాని..కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరు అని రేవంత్ ఫైర్ అవుతూ ఉంటారు. అయితే పోలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే బీజేపీ నేతలు..ఇలా కేసీఆర్ జైలుకు వెళ్తారని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అంటే కేసీఆర్ ఏదో తప్పులు చేసేశారని ప్రజల అనుకుంటారనే కోణంలోనే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి బీజేపీ జైలు స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంది.